Ram Naresh Bhurtia: ఆ ఇంట్లో 66 మంది ఓటర్లు.. కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల తంటాలు!
- రామ్ నరేశ్‌ది అతి పెద్ద ఉమ్మడి కుటుంబం
- మొత్తం 82 మంది కుటుంబ సభ్యులు
- ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు
- ఓటు వేయనున్న 8 మంది ముని మనవళ్లు
ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చూసుకోవడం కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది మొత్తం 82 మంది ఉండే ఓ ఇంట్లో 66 ఓట్లున్నాయి. వాటి కోసం అభ్యర్థులు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలహాబాద్‌లోని బరైదా గ్రామానికి చెందిన 98 ఏళ్ల రామ్ నరేశ్ భుర్టియాది అతి పెద్ద ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యులంతా కలిసి మొత్తం 82 మంది. వీరిలో ఓటు హక్కు కలిగిన వారు 66 మంది.
రేపు అలహాబాద్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రామ్ నరేశ్ కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు ఉంది. విశేషమేంటంటే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రామ్ నరేశ్ ముని మనవళ్లు 8 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరంతా ఒకే వ్యక్తికి ఓటేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఈ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు.