Rumours: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-మాజీ సీఎం షీలా దీక్షిత్ మధ్య ట్వీట్ల యుద్ధం
- మీకు పనిలేకుంటే మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లండి
- పుకార్లు సృష్టించకుండా రాజకీయం ఎలా చేయాలో నేను చెబుతాన్న షీలా
- ఎప్పుడు రావాలో చెప్పాలన్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్-మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. తన ఆరోగ్యంపై పుకార్లు ఎందుకు సృష్టిస్తున్నారంటూ శనివారం షీలాదీక్షిత్ ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ‘‘నా ఆరోగ్యంపై పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు. మీకేమీ పని లేకుంటే మా ఇంటికి భోజనానికి రండి. అప్పుడైనా తెలుస్తుంది నేనెలా ఉన్నానో. అలాగే, రూమర్లు ప్రచారం చేయకుండా ఎన్నికల్లో ఎలా ఫైట్ చేయవచ్చో నేర్చుకుందురు గాని’’ అని షీలా దీక్షిత్ ట్వీట్ చేశారు.
షీలా ట్వీట్‌ను కేజ్రీవాల్ ఖండించారు. ఆమె ఆరోగ్యంపై తాను ఎటువంటి పుకార్లు సృష్టించలేదని స్పష్టం చేశారు.‘‘మీ ఆరోగ్యం గురించి నేనెప్పుడు మాట్లాడాను? పెద్దలను గౌరవించమనే నా కుటుంబం నాకు నేర్పింది. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. చికిత్స కోసం మీరు విదేశాలకు వెళ్లినప్పుడు మీ ఆరోగ్యం గురించి వాకబు చేశాను. సరే కానీ, మీ ఇంటికి భోజనానికి ఎప్పుడు రమ్మంటారు?’’ అంటూ కేజ్రీవాల్ తిరిగి ట్వీట్ చేశారు. కాగా, షీలా దీక్షిత్ అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదంటూ ఆప్ కార్యకర్తలు పుకార్లు ప్రచారం చేసినట్టు తెలియడంతోనే దీక్షిత్ ఇలా స్పందించారు.