Telangana: వెల్దుర్తి మృతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించండి!: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ డిమాండ్
- కర్నూలు ప్రమాదంలో 16 మంది దుర్మరణం
- వీరిలో 15 మంది తెలంగాణవాసులే
- న్యాయం చేయాలంటూ రోడ్డుపై బాధిత కుటుంబాల బైఠాయింపు
కర్నూలు జిల్లాలోని వెల్దుర్తిలో నిన్నజరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బైక్ ను తప్పించే క్రమంలో ఓ ట్రావెల్స్ బస్సు తుఫాన్ వాహనాన్నిఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో భౌతికకాయాలకు కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు.
అయితే తమవారికి న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఈరోజు ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ మృతుల్లో 15 మంది తెలంగాణవారే కాగా, వీరంతా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురానికి చెందినవారుగా పోలీస్ అధికారులు గుర్తించారు.
మరోవైపు వడ్డేపల్లికి ఆరు మృతదేహాలు ఈరోజు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆలంపూర్-రాయచూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వీరికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మద్దతు పలికారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేవరకూ ఆందోళన విరమించబోమని సంపత్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ప్రజాప్రతినిధులకే పరిమితమనీ, అధికారులకు వర్తించదని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎస్ జోషీ, సంబంధిత జిల్లా కలెక్టర్ నష్టపరిహారాన్ని ప్రకటించవచ్చని తేల్చిచెప్పారు.