Maneka Gandhi: రౌడీయిజం చేయొద్దు... పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యర్థికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన మేనకా గాంధీ
- సుల్తాన్ పూర్ నియోజకవర్గం వద్ద ఉద్రిక్తత
- బీఎస్పీ అభ్యర్థి చంద్ర భద్ర సింగ్ పై మేనక ఆగ్రహం
- ఓటర్లను భయపెడుతున్నారంటూ ఆరోపణ
దేశంలో సార్వత్రిక ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇవాళ ఆరో విడత పోలింగ్ నిర్వహిస్తుండగా, పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నియోజకవర్గంలో కూడా బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఇక్కడ బీజేపీ తరఫున పోటీచేస్తున్నది ఎవరో కాదు... సాక్షాత్తు కేంద్రమంత్రి మేనకా గాంధీ. ఆమె ప్రత్యర్థి బీఎస్పీకి చెందిన చంద్ర భద్ర సింగ్.
అయితే, ఓ పోలింగ్ కేంద్రం వద్ద సింగ్ మద్దతుదారులు ఓటర్లను బెదిరిస్తున్నారంటూ మేనక దృష్టికి రావడంతో వెంటనే ఆమె అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా వేలు చూపిస్తూ చంద్ర భద్ర సింగ్ కు వార్నింగ్ ఇచ్చారు. మీ రౌడీయిజం ఇక్కడ చూపించవద్దంటూ హెచ్చరించారు. రౌడీల్లా బెదిరిస్తే ఓట్లు పడవు అంటూ స్పష్టం చేశారు.
దీనికి చంద్ర భద్ర సింగ్ బదులిస్తూ, తానేమీ రౌడీయిజం చేయట్లేదని, బీజేపీ నేతల తీరే సరిగాలేదంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు రాత్రివేళ డబ్బు పంచారని, అడ్డుకున్న తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బీఎస్పీ కార్యకర్తలు చంద్ర భద్ర సింగ్ కు అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తి అండతో చంద్ర భద్ర సింగ్ రెచ్చిపోతున్నారని ఈ సందర్భంగా మేనకా గాంధీ ఆరోపణలు చేశారు.