Gujarat: దళితుడి పెళ్లి ఊరేగింపును అడ్డుకునేందుకు... రోడ్డుపై యజ్ఞం ప్రారంభించిన అగ్రవర్ణాలు!
- గుజరాత్ లో ఘటన
- ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి
- పలువురు పోలీసులకూ గాయాలు
ఓ దళిత యువకుడి వివాహ ఊరేగింపు మండపానికి బయలుదేరిన వేళ, దాన్ని ఆపేందుకు అగ్రవర్ణాల వారు నడిరోడ్డుపై యజ్ఞాన్ని ప్రారంభించడంతో తీవ్ర ఉద్రిక్తత, రాళ్ల దాడి చోటు చేసుకున్నాయి. గుజరాత్ లో ఈ ఘటన జరుగగా, పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఆరావళి జిల్లా, కంబియాసర్ గ్రామంలో ఓ దళితుడి వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు.
మండపానికి వెళ్లేందుకు వారంతా బరాత్ నిర్వహిస్తూ సాగుతుండగా, పటీదార్ కమ్యూనిటీకి చెందిన పలువురు రోడ్డుపై పూజలు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో మొదలైన గొడవ రాళ్లదాడికి దారితీసింది. పోలీసులు వచ్చిన తరువాత కూడా ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటుండటంతో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకూ గాయాలు అయ్యాయి.
పటీదార్ వర్గం వారు రోడ్డును ఆక్రమించి, యజ్ఞం చేస్తూ, భజనలు ప్రారంభించారని, బరాత్ ను అడ్డుకోవడమే వారి ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, వరుడి కుటుంబానికి పోలీసు భద్రతను కల్పించామని గాంధీనగర్ రేంజ్ ఐజీ మయాంక్ చావ్డా తెలిపారు.