Abhinandan varthaman: వింగ్ కమాండర్ అభినందన్‌కు తొలి పోస్టింగ్.. రాజస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో విధులు
- పాక్ చెరలో 60 గంటల పాటు బందీగా ఉన్న అభినందన్
- విడుదలై భారత్‌కు చేరాక ఇదే తొలి పోస్టింగ్
- బాధ్యతల వివరాలు గోప్యం
పాకిస్థాన్ చెరలో 60 గంటల పాటు బందీగా ఉండి విడుదలైన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధులకు హాజరయ్యాడు. రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో అధికారులు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. శనివారమే ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్‌లో విధులు వర్ధమాన్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో బికనేర్‌లో పనిచేశాడు. అంతేకాదు, ఆయన తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో ఉండగా అభినందన్ ఆ రాష్ట్రంలో చదువుకున్నాడు కూడా.
అభినందన్‌కు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ఎటువంటి విధులు అప్పగించారన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు. సూరత్‌గఢ్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ఉండడంతో దానికి సంబంధించిన విధులే ఆయనకు అప్పగించి ఉంటారని తెలుస్తోంది. అయితే, ఒకసారి పైలట్ విధుల నుంచి తప్పించిన ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం తిరిగి ఫ్లైయింగ్ బాధ్యతలు అప్పగించవచ్చా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కానీ, అభినందన్ విషయంలో ఇది వర్తించదని సమాచారం. దీంతో ఆయనకు మళ్లీ ఫ్లైయింగ్ బాధ్యతలే అప్పగించి ఉంటారని చెబుతున్నారు. కాగా, పాక్ చెర నుంచి అభినందన్ తిరిగి వచ్చాక అతడికి ఇదే తొలి పోస్టింగ్.