Andhra Pradesh: నంద్యాల, కర్నూలులో మనమే గెలుస్తున్నాం.. వైసీపీ అప్పట్లోనూ ఇదే నాటకాలు ఆడింది!: సీఎం చంద్రబాబు
- మే 23న టీడీపీ గెలుపు లాంఛనం కానుంది
- మోదీ ఏపీకి చేసిన అన్యాయంపై టీడీపీ పోరాడింది
- టీడీపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉంది
తెలుగుదేశం మంచికి మారుపేరనీ, వైసీపీ, బీజేపీలు దుర్మార్గాలకు కేరాఫ్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా వైసీపీ బుకాయిస్తోందని మండిపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు ఇదే తరహాలో నాటకాలు ఆడారని గుర్తుచేశారు. మే 23న టీడీపీ గెలుపు లాంఛనం కానుందని చెప్పారు. ఈరోజు నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నేతలతో చంద్రబాబు తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మోదీ హయాంలో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ పోరాడిందనీ, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని ఏకం చేశామని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో మోదీ 28 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతున్నారనీ, సైన్యం త్యాగాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నంద్యాల, కర్నూలు లోక్ సభ సీట్లలో టీడీపీ గెలుపు తథ్యమనీ, సంస్థాగతంగా బలంగా ఉండటం పార్టీకి కలసి వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీకి 65 లక్షల కార్యకర్తలు, 4 లక్షల సేవా మిత్రలు, 45,000 మంది బూత్ కన్వీనర్లు, 5 వేల మంది ఏరియా కన్వీనర్లు ఉన్నారని చెప్పారు. వీరంతా తామే అభ్యర్థులం అన్నరీతిలో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. టీడీపీ గెలుస్తుందని అన్ని సర్వేలు, విశ్లేషణలు తేల్చిచెప్పాయన్నారు. ఏపీలో ఒక్క మహిళలకే రూ.లక్ష కోట్ల సంక్షేమ ఫలాలు అందజేశామని తెలిపారు.