RSS: ఆరెస్సెస్ కు, ఐసిస్ కు పెద్దగా తేడా లేదు: కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
- తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆరెస్సెస్, ఐసిస్ అసమ్మతిని లేకుండా చేస్తున్నాయన్న అళగిరి
- గాడ్సే హిందూ ఉగ్రవాదేనని పునరుద్ఘాటన
తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ ఆంగ్ల ఛానల్ తో ఆయన మాట్లాడుతూ హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్)ను ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)తో పోల్చారు. మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే అనే వ్యక్తి హత్య చేశాడని అళగిరి గుర్తుచేశారు.
‘ఈ గాడ్సే హిందూ మహాసభకు చెందినవాడు కావొచ్చు. ఆరెస్సెస్ కు చెందినవాడు కావొచ్చు. వీళ్లందరి ఆలోచనలు ఒకేలా ఉంటాయ్. తమకు వ్యతిరేకంగా మాట్లాడే, అసమ్మతిని ప్రకటించే గొంతుకలను నొక్కేయాలని వీరు అనుకుంటారు.
అలాంటి వాళ్లను లేకుండా చేయాలనుకుంటారు. అదే ఆలోచనా విధానాన్ని అరబ్ దేశాల్లో ఉగ్ర సంస్థ ఐసిస్ పాటిస్తోంది. ఆరెస్సెస్, ఐసిస్ కు పెద్దగా తేడా లేదు. రెండూ ఒక్కటే’ అని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని ఓ హిందూ ఉగ్రవాదే హత్య చేశాడని పునరుద్ఘాటించారు.
అతను ఆరెస్సెస్ వాడా, హిందూ మహాసభ సభ్యుడా అన్నది అనవసరమని అభిప్రాయపడ్డారు. స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేననీ, అతని పేరు నాథురాం గాడ్సే అని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి జరుగుతున్న ఓ చర్చా కార్యక్రమంలో అళగిరి ఆరెస్సెస్ ను ఐసిస్ తో పోల్చారు.