Telangana: క్రమశిక్షణా సంఘం వీహెచ్ కు తొత్తు.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: నగేశ్ ముదిరాజ్

  • పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై నగేశ్ ఆగ్రహం
  • గాంధీభవన్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన 
  • నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు: నగేశ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) పై దురుసుగా ప్రవర్తించిన  టీపీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ ను సస్పెండ్ చేస్తూ, క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నగేశ్ స్పందిస్తూ, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్ లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. తనను అకారణంగా సస్పెండ్ చేశారని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు.

‘నేను చేసింది తప్పని ఒప్పుకుంటున్నాను’ కానీ, ఈ ఘటనకు ముఖ్యకారకుడైన వీహెచ్ ను ఎందుకు వదిలేస్తారు? అని ప్రశ్నించారు. క్రమశిక్షణా సంఘం వీహెచ్ కు తొత్తుగా మారిందని, అందుకు సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణా సంఘంలో ఉన్న వాళ్లందరూ వీహెచ్ కు చిన్ననాటి స్నేహితులని అన్నారు. బీసీల కోసం పాటుపడతామంటూనే బీసీలను అణగదొక్కాలని వీహెచ్ చూస్తున్నారని విమర్శించారు.

ఆరోజు జరిగిన సంఘటన దురదృష్టకరమని, క్షమాపణ కూడా కోరానని చెప్పారు. అసలు, ఆ సంఘటనకు ముఖ్యకారణం వీహెచ్ అని ఆరోపించారు. ఆరోజున అక్కడికి వచ్చిన కుంతియా కూర్చునేందుకు కుర్చీ వేద్దామని వేదికపైకి తాను ఎక్కితే, తనను వీహెచ్ దుర్భాషలాడటమే కాకుండా తనను తోసేశారని, కిందకు పడిపోతున్న తనపై మైకుతో ఆయన కొట్టారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News