Andhra Pradesh: మా స్కూల్ తో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు!: సంస్థ సీఈవో శ్రీనివాస్ స్పష్టీకరణ

  • శ్రీకాకుళంలో ప్రారంభం కానున్న పాఠశాల
  • చిరంజీవి భాగస్వామిగా ఉన్నారని వార్తలు
  • ఖండించిన పాఠశాల యాజమాన్యం

శ్రీకాకుళం జిల్లాలో త్వరలోనే చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట మెగాస్టార్ ఫ్యామిలీ విద్యాసంస్థను నెలకొల్పుతున్నట్లు ఈరోజు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని చిరంజీవి కుటుంబమే నిర్వహిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. తమ పాఠశాలకు, మెగాస్టార్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. సేవా దృకథంతో, సామాజిక స్పృహతో ఈ విద్యా సంస్థను శ్రీకాకుళంలో ప్రారంభించామని సంస్థ సీఈవో శ్రీనివాసరావు చెప్పారు.

మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతోనే చిరంజీవిని గౌరవ ఫౌండర్ గా, రామ్ చరణ్ ను గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబును గౌరవ చైర్మన్ గా నియమించుకున్నామని స్పష్టం చేశారు. ఈ పాఠశాలకు, మెగా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. పేద ప్రజలకు అత్యున్నత సౌకర్యాలతో ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ సీఈవో జె.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు.

  • Loading...

More Telugu News