Akhilesh Yadav: చౌకీదార్‌ను ఢిల్లీ నుంచి, ధోకీదార్‌ను లక్నో నుంచి గద్దె దింపాల్సిన అవసరముంది: అఖిలేశ్ యాదవ్
- మహాకూటమి కొత్త ప్రధానిని అందిస్తుంది
- నవభారత నిర్మాణం జరిపి తీరుతుంది
- యువత ఉద్యోగాలను బీజేపీ కొల్లగొట్టిందన్న అఖిలేశ్
చౌకీదార్‌ను ఢిల్లీ నుంచి, ధోకీదార్‌ను లక్నో నుంచి గద్దె దింపాల్సిన అవసరముందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు గోరఖ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఎస్పీ - బీఎస్పీ సంయుక్త ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, దేశానికి మహాకూటమి కొత్త ప్రధానిని అందిస్తుందని, నవభారత నిర్మాణం జరిపి తీరుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ యువత ఉద్యోగాలను కొల్లగొట్టడమే కాకుండా పిల్లల విద్యకు కూడా గండికొట్టిందన్నారు.
ఎంతమంది రైతులకు బీజేపీ రుణ మాఫీ చేసింది? రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? అని అఖిలేశ్ ప్రశ్నించారు. నవభారత నిర్మాణం జరుపుతామని బీజేపీ గొప్పలు చెప్పిందని, వారి హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. అబద్ధాలు, విద్వేషాల వ్యాప్తితో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని అఖిలేశ్ ఆరోపించారు. ఈ సంయుక్త ర్యాలీలో బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ పాల్గొన్నారు.