Chandrababu: హోంగార్డుల డీఏ అంశం.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- ఒక్కో హోంగార్డుకు రూ.9000 చొప్పున డీఏ చెల్లించాలి
- రూ.4,500 మాత్రమే చెల్లించారు
- ‘పోలవరం’ సందర్శనకు రూ.400 కోట్లు ఖర్చు చేశారు!
ఇటీవల ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో డ్యూటీలు నిర్వహించిన హోం గార్డులకు చెల్లించాల్సిన డీఏ కంటే తక్కువ చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో 65 రోజులు ఎర్రని ఎండలో 12 వేల మంది హోం గార్డులు డ్యూటీ చేశారని, వారికి తొమ్మిది వేల రూపాయల చొప్పున డీఏ చెల్లించాలి కానీ, రూ.4,500 చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు హోం గార్డుల ఉసురు తగులుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి విజయసాయి ప్రస్తావించారు. పూర్తి కాని ఈ ప్రాజెక్టు సందర్శనకు రూ.400 కోట్లు ఖర్చు చేసి ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నింటినీ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ రాయపాటి సంస్థలకు అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే కేబినెట్ భేటీ అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పోలవరం ప్రాజెక్టు పనులపై ఆడిటింగ్ జరిపిన తర్వాతే చెల్లింపులు జరపాలని విజయసాయిరెడ్డి అన్నారు.