Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం... దంచుతున్న ఎండ, ముంచుతున్న వాన!
- మధ్యాహ్నం వరకూ ఎండ మంటలు
- ఆపై మేఘాలు కమ్ముకుని వర్షం
- ఇబ్బందులు పడుతున్న రైతులు
తెలుగు రాష్ట్రాలు విచిత్రమైన వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం వరకూ ఎండ మంటలు ఉన్న ప్రాంతంలో సాయంత్రానికి కురుస్తున్న భారీ వర్షం రైతుల ఆరుగాలం శ్రమను దోచుకుంటోంది. అరేబియా సముద్రం నుంచి వీచే తేమ గాలులు, ఉపరితల ఆవర్తనానికి కలిసి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉండటంతో, ఎప్పుడు ఎక్కడ వర్షం కురుస్తుందో చెప్పలేని పరిస్థితి. అరగంట వ్యవధిలోనే వాతావరణం మారిపోయి, నిమిషాల వ్యవధిలో వర్షం పడుతూ ఉండటంతో, ఆరుబయట ఆరబెట్టుకున్న పంటను సైతం రైతులు కాపాడుకోలేకపోతున్నారు.
నిన్న కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఇదే పరిస్థితి. మధ్యాహ్న సమయం వరకూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉండగా, సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో పలు మార్కెట్ యార్డుల్లో ఆరుబయట ఉన్న ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని రైతులు ఈ ఉదయం ధర్నాకు దిగారు.
ఇక ఎండమంటల విషయానికి వస్తే, చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నాడు రెంటచింతలలో 47.5 డిగ్రీలు, గుంటూరులో 46 డిగ్రీలు, తిరుపతిలో 44 డిగ్రీలు, రామగుండంలో 46.3 డిగ్రీలు, ఆదిలాబాద్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.