ltte: ఎల్టీటీఈ నుంచి దేశానికి ఇంకా ముప్పు ఉంది.. అందుకే నిషేధాన్ని పొడిగిస్తున్నాం: కేంద్ర హోంశాఖ

  • భారత్ పై ఎల్టీటీఈకి తీవ్ర వ్యతిరేకత ఉంది
  • నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నాం
  • నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది

శ్రీలంక కేంద్రంగా ఉన్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)పై భారత ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు ఈ రోజు తాజా ఉత్తర్వులను జారీ చేసింది. 'ప్రత్యేక తమిళ దేశం స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న ఎల్టీటీఈ... భారతదేశ గడ్డపై కూడా దారుణాలకు పాల్పడింది. దీని కోసం నిధులను కూడా సమీకరిస్తోంది,' అని తన ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది.

తమిళనాడులోకి కొందరు ఎల్టీటీఈ క్యాడర్ అడుగుపెట్టారని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు వీరు పాల్పడే అవకాశం ఉందని హోంశాఖ తెలిపింది. ఎల్టీటీఈపై నిషేధం ఉన్నప్పటికీ దానికి కొన్ని ఇతర సంస్థలు, వ్యక్తులు మద్దతుగా ఉన్నారని చెప్పింది. ఎల్టీటీఈపై భారత ప్రభుత్వ వైఖరిని ఆ సంస్థకు చెందిన నాయకులు, సభ్యులు, మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. భారత్ పై వ్యతిరేకత ఎల్టీటీఈలో ఇప్పటికీ బలంగా ఉందని చెప్పింది. ఎల్టీటీఈ వల్ల మన దేశానికి ప్రమాదం ఉందని... అందుకే దానిపై నిషేధాన్ని పొడిగిస్తున్నామని తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని బలితీసుకున్నది ఎల్టీటీఈ అనే విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News