Andhra Pradesh: మహానాడు ఎన్ని రోజులు చేద్దాం?.. టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చ!
- హాజరైన లోకేశ్, గంటా, కళా వెంకట్రావు
- మహానాడు, ఎన్నికల ఫలితాలపై చర్చ
- సమావేశంలో పాల్గొన్న సీఎం రమేశ్, డొక్కా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ ముఖ్యనేతలు, ఏపీ మంత్రులతో సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు నారా లోకేశ్, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావులు హాజరు అయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, సీఎం రమేశ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మహానాడు నిర్వహణపై చంద్రబాబు ఈ సందర్భంగా చర్చించారు. మహానాడును 3 రోజుల పాటు నిర్వహించాలా? లేక ఒకరోజుతోనే ముగించాలా? అనే విషయాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడంపై కూడా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీతో పాటు 25 లోక్ సభ స్థానాలకు గత నెల 11న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.