Andhra Pradesh: ఏపీ పౌరుషం ఏంటో ఈ నెల 23 తర్వాత జగన్, కేసీఆర్, మోదీలకు తెలుస్తుంది!: సాధినేని యామిని
- ‘మేకిన్ ఇండియా’తో ఒక్క కంపెనీ రాలేదు
- మే 23 తర్వాత మోదీ హిమాలయాలకే
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ప్రధాని మోదీ మేకిన్ ఇండియా(భారత్ లో తయారీ) కార్యక్రమం ప్రారంభించాక ఒక్క కంపెనీ కూడా దేశంలోకి రాలేదని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. మహిళలంతా తనకే ఓటేశారని ప్రధాని మోదీ ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మోదీ హిమాలయాలకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సాధినేని యామిని మాట్లాడారు. మోదీ పాలన జర్మనీ నియంత హిట్లర్ ను తలపిస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఏపీ పౌరుషం అంటే ఏంటో మే 23న మోదీ, జగన్, కేసీఆర్ లకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో జగన్, కేసీఆర్, మోదీలకు ఆస్కార్ ఇవ్వొచ్చని యామిని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఆపలేరనీ, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు.