ys: ‘వైఎస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్’ పుస్తకావిష్కరణ
- పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ సీఎం రోశయ్య
- ఈ పుస్తకం రాయమని కేవీపీ భార్య కోరారు
- ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయన్న ఉండవల్లి
‘వైఎస్సార్ తో.. ఉండవల్లి అరుణ్ కుమార్’ పుస్తకాన్ని మాజీ సీఎం రోశయ్య ఆవిష్కరించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుస్తక రచయిత ఉండవల్లి అరుణ్ కుమార్, ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, మాజీ సీఎస్ లు మోహన్ కందా, రమాకాంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఐవైఆర్ కృష్ణారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులైన మిత్రులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, తనను ఈ పుస్తకం రాయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు భార్య సునీత కోరారని అన్నారు. వైఎస్ తో ఉన్న సంబంధాలపై ఓ పుస్తకం రాయాలంటూ తనపై ఆమె ఒత్తిడి చేశారని, అయితే, తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పలేదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి రాయాలంటే చాలా మంది గురించి ప్రస్తావించాలని, అయితే, వారిలో కొంతమంది వేర్వేరు పార్టీలలో చేరిపోయారని వారి గురించి ప్రస్తావిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని ఆలోచించి, అందువల్లే ఈ పుస్తకం రాయడం ఆలస్యం చేశానని చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను ఓ కార్యకర్తగా ఉన్న సమయంలో ఆయనతో తనకు పరిచయం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను రాజమండ్రిలో కార్యకర్తను అని, అలాంటి కార్యకర్తను ఓ ఎంపీగా చేశారని అన్నారు. కార్యకర్త నుంచి ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్ తో తనకు ఉన్న అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచానని, ఈ పుస్తకం చదివితే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.