Raviprakash: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు ఇచ్చిన గడువు నేటితో పూర్తి... గాలింపునకు ప్రత్యేక బృందాలు!
- పోలీసుల విచారణకు హాజరు కాని రవిప్రకాశ్
- ఇప్పటికే మూడు సార్లు నోటీసులు
- లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే ఆలోచన
డేటా చోరీ, ఫోర్జరీ తదితర ఆరోపణలు ఎదుర్కొంటూ, పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న టీవీ9 న్యూస్ చానెల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ కేసులో సీఆర్పీఎఫ్ సెక్షన్ 160 కింద రెండు సార్లు నోటీసులు ఇచ్చిన సైబరాబాద్ కమిషనరేట్ అధికారులు, రవిప్రకాశ్ నుంచి స్పందన లేకపోవడంతో, సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేస్తూ, 15వ తేదీ 11 గంటల్లోగా విచారణకు రావాలని ఆదేశించారు.
ఇక ఈ గడువు నేటితో ముగియనుండగా, ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తున్న అధికారులు, అరెస్ట్ వారెంట్ ను జారీ చేసి, లుక్ అవుట్ నోటీసులు కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో రవిప్రకాశ్ ఆచూకీని తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపాలని కూడా యోచిస్తున్నారు. ఇక రవిప్రకాశ్ ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ వద్ద తలదాచుకున్నారని పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆయన సెల్ ఫోన్ స్విచ్చాఫ్ కావడం, సోషల్ మీడియా ఖాతాల్లో అప్ డేట్ లేకపోవడంతో రవిప్రకాశ్ ఆచూకీపై స్పష్టత లేదు.