terrorists: బుద్ధ పూర్ణిమ రోజున ఇండియాలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర: ఇంటెలిజెన్స్ హెచ్చరిక
- నేపాల్ మీదుగా బండిపొరాకు చేరుకున్న ఉగ్రవాదులు
- పలు చోట్ల విధ్వంసానికి ప్లాన్
- బౌద్ధ ఆలయాలపై దాడికి సిద్ధంగా ఉన్న మహిళా సూసైడ్ బాంబర్
భారత్ లో పలు చోట్ల భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న కచ్చితమైన సమాచారంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ముగ్గురు టెర్రరిస్టులు నేపాల్ గుండా జమ్ముకశ్మీర్ లోని బండిపొరాకు చేరుకున్నట్టు సమాచారం. మరోవైపు, బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేస్తున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఓ మహిళా సూసైడ్ బాంబర్... బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్ లలోని బౌద్ధ ఆలయాలపై దాడికి పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి ఐసిస్ ప్రవేశించిందని ఇంటెలిజెన్స్ ఓ నిర్ధారణకు వచ్చింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల ఘటన కూడా ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.
ఉగ్రదాడుల కోసం మహిళా సూసైడ్ బాంబర్ రంగంలోకి దిగడం కలవరపరుస్తోంది. బుద్ధ పూర్ణిమ (మే 18) నాడు ఆమె దాడులకు తెగబడే అవకాశం ఉందని సమాచారం. బౌద్ధ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేలా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు.