West Bengal: మమతా బెనర్జీ సర్కారును బర్తరఫ్ చేయాలి: బీజేపీ డిమాండ్
- పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని ధ్వజం
- నిన్న కోల్కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్ షో సందర్భంగా ఘర్షణలు
- దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ నిరసన ర్యాలీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, అందువల్ల అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో బీజేపీ, మమత సర్కారుపై విరుచుకుపడుతోంది.
కోల్కతాలో నిన్న బీజేపీ చీఫ్ అమిత్షా రోడ్డు షో సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా 19వ శతాబ్దపు సామాజిక కార్యకర్త విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దాడులు హింసాత్మకంగా మారడంతో పలుచోట్ల పోలీసులు జోక్యం చేసుకుని అల్లరి మూకలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని బీజేపీ ఈ రోజు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మమత సర్కార్ను బర్తరఫ్ చేయాలని కోరింది.