Narendra Modi: మోదీ ముందు పకోడీ అమ్మి నిరసన తెలపాలని చూసిన నిరుద్యోగులు... అరెస్ట్!
- చండీగఢ్ లో మోదీ ఎన్నికల ప్రచారం
- గ్రాడ్యుయేట్ల వేషాల్లో వచ్చి పకోడీల అమ్మకం
- గతంలో పకోడీ అమ్మినా ఉపాధేనన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ చండీగఢ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి వున్న వేళ, నాటకీయ నిరసనలు చోటుచేసుకున్నాయి. మోదీ ముందు పకోడీలు అమ్మి నిరసన తెలపాలని భావించిన కొందరు నిరుద్యోగులు, పట్టభద్రుల వేషాలు వేసుకుని అక్కడికి వచ్చారు. వీరు 'మోదీజీకీ పకోడీ' అని అరుస్తూ పకోడీలను అమ్మడం ప్రారంభించారు. అయితే, వీరి పకోడీల వ్యాపారం ఎక్కువసేపు సాగలేదు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు, వారందరినీ అరెస్ట్ చేశారు.
కాగా, గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "ఎవరైనా ఓ వ్యక్తి పకోడీలు అమ్ముతూ, రోజుకు 200 రూపాయలు సంపాదిస్తుంటే, దాన్ని కూడా ఉపాధిగానే పరిగణించాలి. అది కూడా ఓ ఉద్యోగమే" అని వ్యాఖ్యానించగా, తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజా నిరసనల్లో 'ఇంజనీర్లు తయారు చేసిన వేడివేడి పకోడీలు', 'బీఏలు, ఎల్ఎల్బీలు తయారు చేసిన పకోడీలు' అని కేకలు పెడుతూ పకోడీలు అమ్మారు. వీరందరినీ పోలీసులు ఓపెన్ వ్యాన్ లోకి ఎక్కించినా, వారి నిరసన ఆగలేదు. వారిని అక్కడి నుంచి తరలించేంత వరకూ పకోడీ అమ్మకాల నిరసన కొనసాగింది.