Kanna: ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వారి జాగీరులా భావిస్తున్నాయి: విపక్షాలపై కన్నా ఫైర్
- ప్రజాస్వామ్యంలో ఇది శుభపరిణామం కాదు
- బీజేపీపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి
- ప్రజల మద్దతు బీజేపీకే ఉంది
ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పశ్చిమ బెంగాల్ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై బెంగాల్ లో రాళ్ల దాడి జరగడాన్ని కన్నా ఖండించారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంపై గుత్తాధిపత్యం తమదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం శుభపరిణామం కాదని కన్నా స్పష్టం చేశారు.
బీజేపీపై గతకొంతకాలంగా విపక్షాలు దుష్ప్రచారం సాగిస్తున్నాయని, అయినప్పటికీ ప్రజల మద్దతు బీజేపీకే ఉందని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక చర్యలకు పాల్పడడం ద్వారా విజయం సాధించాలని మమతా బెనర్జీ భావిస్తున్నట్టుందని, ఆమె తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉందా? అన్న సందేహాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అమిత్ షాపై రాళ్ల దాడి నేపథ్యంలో మమతా బెనర్జీపై ఈసీ చర్యలు తీసుకోవాలని, ఆమెను అరెస్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.