India: 36 ఏళ్ల నాటి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్
- 1983లో 175 పరుగులు చేసిన కపిల్
- ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో ఇమాముల్ హక్ 151 రన్స్
- ఇంగ్లాండ్ గడ్డపై 150 ప్లస్ స్కోరు చేసిన పిన్నవయస్కుడిగా రికార్డు
క్రికెట్ ప్రపంచంలో భారత ఆణిముత్యం కపిల్ దేవ్ ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. అయితే, తాజాగా పాకిస్థాన్ కు చెందిన యువ ఆటగాడు ఇమాముల్ హక్ తన అద్వితీయ బ్యాటింగ్ ప్రదర్శనతో కపిల్ దేవ్ 36 ఏళ్ల కిందట నమోదు చేసిన రికార్డును తిరగరాశాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై ఓ వన్డేలో 150కి పైగా పరుగులు చేసిన అత్యంత పిన్నవయసు క్రికెటర్ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉండేది. దాన్ని హక్ తన పేరిట లిఖించుకున్నాడు.
కపిల్ 1983 వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టుపై అజేయంగా 175 పరుగులు చేశాడు. అప్పుడు కపిల్ వయసు 24 సంవత్సరాలు కాగా, ఇప్పుడా రికార్డు పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ వశమైంది. 23 ఏళ్ల హక్ తాజాగా ఇంగ్లాండ్ జట్టుతో వన్డే మ్యాచ్ లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి 131 బంతుల్లో 151 పరుగులు సాధించాడు. తద్వారా ఇంగ్లాండ్ గడ్డపై 150 ప్లస్ స్కోరు చేసిన పిన్నవయస్కుడిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకున్నాడు.
ఈ వన్డే మ్యాచ్ లో పాక్ ఇమాముల్ హక్ సెంచరీ సాయంతో 359 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ బెయిర్ స్టో శతకం సాధించడంతో 4 వికెట్లతోనే లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేసింది.