YSRCP: ఈసీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మండిపాటు, వైసీపీ అసంతృప్తి!
- 19న చంద్రగిరి పరిధిలోని 5 బూత్ లలో రీపోలింగ్
- ఈసీ నిర్ణయం సరికాదంటున్న తెలుగుదేశం
- స్వాగతిస్తూనే అసంతృప్తిని వ్యక్తం చేసిన వైసీపీ
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో గత నెల పోలింగ్ సాఫీగా జరగలేదని గుర్తించిన ఈసీ, మొత్తం 5 కేంద్రాల్లో రీపోలింగ్ కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయంపై అటు టీడీపీ, ఇటు వైసీపీ మండిపడుతున్నాయి. రీ పోలింగ్ 19వ తేదీన జరుగనుండగా, పోలింగ్ ముగిసిన నెల రోజుల తరువాత రీపోలింగ్ ఏమిటని టీడీపీ ప్రశ్నిస్తోంది. తాము లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోని ఎన్నికల కమిషన్, వైసీపీ ఇచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా వారికి అనుకూలంగా స్పందిస్తోందని ఆరోపించింది.
ఇదే సమయంలో తాము ఏడు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, వాటిల్లో రీపోలింగ్ జరిపించాలని ఫిర్యాదు చేస్తే, కేవలం ఐదు చోట్ల మాత్రమే అనుమతి ఇవ్వడంపై వైసీపీ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. చంద్రగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ వివరణ కోరగా, రిటర్నింగ్ అధికారులు పంపిన రిపోర్టుల ఆధారంగా ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే, మిగతా రెండు కేంద్రాల విషయంలోనూ ఇదే విధమైన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా చెవిరెడ్డి డిమాండ్ చేశారు.