Reliance: ముఖేశ్ అంబానీ తనయుడి పెద్ద మనసు... రోడ్డుపై రక్తమోడుతున్న వ్యక్తిని సొంతకారులో తరలించిన వైనం
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన బైకర్
- తమ కారులో ఎక్కించి ఆసుపత్రికి పంపిన ఆకాశ్ అంబానీ
- సోషల్ మీడియాలో వైరల్
భారతదేశపు అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ కుటుంబం ముంబయిలో భారీ కాన్వాయ్ తో తరలివెళుతుండగా ఓ వ్యక్తి రోడ్డుపై రక్తమోడుతున్న స్థితిలో కనిపించాడు. వెంటనే తమ కాన్వాయ్ ని ఆపించిన ముఖేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ ఆ క్షతగాత్రుడ్ని తమ కాన్వాయ్ లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. లక్షల కోట్ల సంపదతో తులతూగే అంబానీ కుటుంబం ఓ సామాన్యుడి పట్ల చూపిన మానవీయత అందరినీ ఆకట్టుకుంది.
ఓ యువకుడు బైక్ పై వెళుతూ డివైడర్ ను ఢీకొట్టగా తలకు హెల్మెట్ లేకపోవడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే అంబులెన్స్ కు సమాచారం అందించినా సకాలంలో రాకపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈలోపు అటుగా అంబానీల కాన్వాయ్ రావడం, రోడ్డుపై జనాలను చూసి కారు ఆపిన ఆకాశ్ అంబానీ ఏం జరిగిందంటూ అడగడం ఆ యువకుడి పాలిట వరంగా మారింది.
ఆ యువకుడి పరిస్థితి చూసి చలించిపోయిన అంబానీల వారసుడు వెంటనే తన సిబ్బందికి పురమాయించి కాన్వాయ్ లోంచి ఓ కారును బయటికి తీసుకువచ్చి అతడిని అందులోకి ఎక్కించారు. అంబానీల కుటుంబ భద్రత దృష్ట్యా వారికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ప్రకారం ముందస్తు తనిఖీలు లేకుండా ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపడం కుదరదు. కానీ మానవతా దృక్పథంతో ఆకాశ్ అంబానీ తమ భద్రతను కూడా పట్టించుకోకుండా రోడ్డుపై దిగి ఓ బాధితుడికి ఆపన్న హస్తం అందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.