Jammu And Kashmir: జమ్ములో ఓ వ్యక్తిని కాల్చి చంపిన గోరక్షకులు... కర్ఫ్యూ
- భదేర్వా ప్రాంతంలో ఇద్దరిపై కాల్పులు
- తీవ్ర గాయాలతో బయటపడ్డ మరో వ్యక్తి
- పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన మృతుడి వర్గీయులు
జమ్ముకశ్మీర్ లోని భదేర్వా లోయ ప్రాంతంలో నయీం అనే వ్యక్తిని కాల్చి చంపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ కాల్పులకు కారణమేమిటో పోలీసులు వెల్లడించకపోయినా... గోరక్షకులే ఈ హత్య చేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే మృతుడికి సంబంధించిన వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఐదు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఒక వాహనానికి నిప్పు పెట్టారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, అదుపులోనే ఉందని జమ్ము జోన్ ఇన్స్ పెక్టర్ జనరల్ సిన్హా తెలిపారు.
నిన్న రాత్రి చటేర్గల వైపు నుంచి మరో వ్యక్తితో కలసి నయీం వస్తుండగా వారిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నయీం ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో, ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతుండటం వల్లే కాల్పులు జరిపామని నిందితులు చెప్పారు.