Andhra Pradesh: ఓడిపోతున్నామని చంద్రబాబుకు అర్థమైంది.. అందుకే మాటతీరులో మార్పు వచ్చింది!: అంబటి రాంబాబు
- ఫలితాలు ఎలా వచ్చినా హుందాగా స్వీకరించాలి
- రైతులను పట్టించుకోకుండా బాబు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు అర్థం అయిందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు మాటతీరులో మార్పు వచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా హుందాగా స్వీకరించాలని అంబటి సూచించారు. గత ఆరువారాల్లో ఏపీలో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, కానీ చంద్రబాబు మాత్రం వీటిపై మాట్లాడకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.
చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లెలో ఉద్రిక్తత నెలకొనడంపై ఈ సందర్భంగా అంబటి రాంబాబు స్పందించారు. ‘దళితులతో ఓటు వేయించకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుపడ్డారని మా పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో మా అభ్యర్థి 7 కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించాలని గత నెల 12నే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ కేవలం 5 కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. అన్నిసాక్ష్యాలను పరిశీలించాకే ఈసీ తుది నిర్ణయం తీసుకుంది’ అని అంబటి స్పష్టం చేశారు. అయితే చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించడం అప్రజాస్వామికమని చంద్రబాబు చెప్పడాన్ని అంబటి తప్పుపట్టారు. ‘రీపోలింగ్ అప్రజాస్వామికం అని చంద్రబాబు ఎలా చెబుతారు? బాబు తీరు చూస్తుంటే ఎన్నికలు నిర్వహించడమే అప్రజాస్వామికం అన్నట్లుగా ఉంది. తానే జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. ఓటమి భయంతోనే టీడీపీ అధినేత దిగజారి మాట్లాడుతున్నారు.
ఎన్నికల సందర్భంగా రికార్డు అయిన వెబ్ క్లిప్పింగ్లలో దృశ్యాలు నిజమైనవా? కావా? అన్నది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలి. చంద్రబాబుకు ఈవీఎంలపై, వీవీప్యాట్లపై, ప్రజాస్వామ్యంపై, ఎన్నికలపై, ప్రజలపై విశ్వాసం లేదు. అలా విశ్వాసం లేని వారు రాజకీయాలలో పనికిరారు’ అని విమర్శించారు. అసలు చంద్రబాబుకు దేనిపై నమ్మకం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.