India: దేశంలో గాడ్సేపై చర్చ జరుగుతోంది.. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను!: కేంద్ర మంత్రి హెగ్డే
- ఏడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు చర్చ జరుగుతోంది
- ప్రస్తుత తరం గాడ్సేపై చర్చిస్తోందన్న హెగ్డే
- ఈ చర్చ కారణంగా గాడ్సే సంతోషించి ఉంటాడని వ్యాఖ్య
భారత జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేపై బీజేపీ నేతల ప్రశంసల వర్షం కొనసాగుతోంది. ఇటీవల నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడని బీజేపీ భోపాల్ లోక్ సభ సీటు అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కీర్తించగా, గాడ్సే కంటే రాజీవ్ గాంధీ ఇంకా క్రూరుడని కర్ణాటక బీజేపీ నేత నలిన్ కుమార్ సెలవిచ్చారు. గాడ్సే కేవలం ఒకరినే(గాంధీ) హత్య చేశాడనీ, కానీ రాజీవ్ గాంధీ 17,000 మందిని చంపేశారని ఆరోపించారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ గా ఉండే కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వీరికి తోడయ్యారు. దేశంలో ఈరోజు గాడ్సేపై జరుగుతున్న చర్చ పట్ల తాను సంతోషంగా ఉన్నానని హెగ్డే తెలిపారు.
‘దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గాడ్సే విషయంలో ప్రస్తుత తరం చర్చ జరపడం నిజంగా ఆనందంగా ఉంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో గాడ్సే గురించి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. ఈ చర్చ పట్ల నాథూరాం గాడ్సే నిజంగా సంతోషించి ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు ఈ కేంద్ర మంత్రి వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఈ ట్వీట్ ను వెంటనే తొలగించిన హెగ్డే తన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ కు గురి అయిందని తెలిపారు. గత వారం రోజుల్లో రెండుసార్లు ఇలా జరిగిందని వెల్లడించారు. కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సందేశాలను తన టైమ్ లైన్ లో పోస్ట్ చేశారనీ, దీనిపై విచారిస్తున్నానని స్పష్టం చేశారు.