suddala ashok teja: మా ఇంట్లో పేదరికమున్నా మా అమ్మ తెలియనిచ్చేది కాదు: సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
- కష్టాలను మా అమ్మ తేలికగా తీసుకునేది
- మా నాన్నను బాధపడనిచ్చేది కాదు
- నాకు మా అమ్మ లక్షణమే వచ్చింది
సినీ గేయరచయితగా సుద్దాల అశోక్ తేజకి మంచి పేరుంది. ఆయన రాసిన పాటలు ఆలోచింపజేసేవిగా .. ఆశయం వైపు నడిపించేవిగా ఉంటాయి. అలాంటి సుద్దాల అశోక్ తేజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మా ఇంట్లో పేదరికం ఉన్నప్పటికీ అది మా అమ్మ పైకి కనిపించనిచ్చేది కాదు. తాను నవ్వుతూ .. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవు అనే ఒక వాతావరణాన్ని కల్పించేది.
మా నాన్న డీలాపడిపోతే, 'ఏమీ కాదులే పంతులూ .. అన్నీ అవే సర్దుకుంటాయి, ఇదిగో .. ఈ హార్మోనియంపై ఒక పాటను వాయించు' అంటూ ఆయన ముందు హార్మోనియం ఉంచేది. మా నాన్న మంచి కవి .. గాయకుడు కూడా. ఇల్లు ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో ఆయన బాధపడకుండా అలా అమ్మ ఆయన మనసును మళ్లించేది. ఇలా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తేలికగా తీసుకుంటూ, జీవితంలో ముందుకు వెళ్లడమనేది మా అమ్మ నుంచి నాకు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.