Telangana: 17 లోక్ సభ నియోజకవర్గాలకు 35 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం: రజత్ కుమార్
- కౌంటింగ్ కోసం మూడు వేల టేబుళ్లు ఏర్పాటు చేశాం
- ఒక్కో టేబుల్ కు నలుగురు సిబ్బందిని కేటాయించాం
- నిజామాబాద్ లో మాత్రం ఒక్కో టేబుల్ కు ఆరుగురు
తెలంగాణలో ఓట్ల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు 35 కౌంటింగ్ సెంటర్లు, మూడు వేల టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఒక్కో టేబుల్ కు నలుగురు సిబ్బందిని కేటాయించినట్టు చెప్పారు. నిజామాబాద్ లో మాత్రం ఒక్కో టేబుల్ కు ఆరుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు.
ఈవీఎం, వీవీప్యాట్స్ లో తేడా ఉంటే, వీవీ ప్యాట్స్ స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని, అప్పుడు ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు రెండు గంటల ఎక్కువ సమయం పట్టే అవకాశముందని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఈ కేంద్రాల వద్ద విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు.