modi: కేదార్ నాథుడి ఆశీస్సులు తీసుకున్న మోదీ
- జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించుకున్న మోదీ
- ప్రధాని హోదాలో ఇక్కడకు రావడం ఇది రెండోసారి
- రేపు బద్రీనాథుడిని దర్శించుకునే అవకాశం
ప్రధాని మోదీ ఈ ఉదయం ఉత్తరాఖండ్ లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్ నాథ్ కు విచ్చేశారు. శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన కేదార్ నాథ్ చేరుకున్నారు. ప్రధాని హోదాలో ఆయన ఇక్కడకు రావడం ఇది రెండోసారి. ఆలయం సందర్శనం సందర్భంగా స్థానికుల వస్త్రధారణలో ఆయన ప్రత్యేకంగా కనిపించారు. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉండే కేదార్ నాథ్ లో ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు.
మరోవైపు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, కేదార్ నాథ్ ఆలయ దర్శనం కోసం ఎన్నికల సంఘం అనుమతిని ప్రధాని కార్యాలయం తీసుకున్నట్టు సమాచారం. ప్రధాని పర్యటన అధికారికమైనది కావడంతో ఈసీ అనుమతి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్ లో ఆయన పర్యటించనున్నారు. రేపు బద్రీనాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించే అవకాశం ఉంది.