Andhra Pradesh: బీజేపీకి బ్రేక్ వేయడం ఎలా?.. ముగిసిన చంద్రబాబు-రాహుల్ భేటీ!
- ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- తటస్థులను కలుపుకుపోవడంపై దృష్టి
- మధ్యాహ్నం మాయావతితో సమావేశం కానున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ నెల 23న ఫలితాల ప్రకటన సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఓ అవగాహనకు వచ్చారు.
ఈ సారి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ 272కు ఓ 50 సీట్లు దూరంగా ఉండిపోతుందన్న విశ్లేషణల నేపథ్యంలో తటస్థులను ఆకర్షించే విషయమై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాహుల్ తో సమావేశం అనంతరం చంద్రబాబు ఇతర నేతలను కలిసేందుకు బయలుదేరారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చంద్రబాబు ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశం అవుతారని పార్టీ వర్గాలు చెప్పాయి.