modi: 'భారత ప్రధాన విభజనకారి' అంటూ టైమ్ మేగజీన్ సంచలన కథనంపై మోదీ స్పందన
- టైమ్ మేగజీన్ విదేశాలకు చెందినది
- కథనం రాసిన వ్యక్తి పాకిస్థాన్ రాజకీయ కుటుంబానికి చెందినవాడు
- కథనానికి ఉన్న విశ్వసనీయతను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్ (భారత ప్రధాన విభజనకారి)' పేరుతో టైమ్ మేగజీన్ ప్రచురించిన కవర్ పేజ్ కథనం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. విభజనకారి అయిన మోదీని భారత్ మరో ఐదేళ్లు భరించగలదా? అంటూ తన కథనంలో ప్రశ్నించింది. ఈ కథనంపై ఎట్టకేలకు మోదీ స్పందించారు.
'టైమ్ మేగజీన్ విదేశాలకు చెందినది. ఈ కథనాన్ని రాసిన వ్యక్తి కూడా తాను పాకిస్థాన్ కు చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. అతనికి, అతను రాసిన కథనానికి ఎంత విశ్వసనీయత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు' అంటూ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ కథనాన్ని ఆతిష్ తసీర్ అనే వ్యక్తి రాశారు. 'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గతంలో ఎన్నడూ లేనంతగా విభజించబడింది' అంటూ కథనంలో పేర్కొన్నారు. దేశంలోని కొన్ని సమూహాలపై జరుగుతున్న దాడులు, యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎం చేయడం, మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలైన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను ఎన్నికల బరిలో నిలబెట్టడం తదితర అంశాలను కూడా కథనంలో ఆయన లేవనెత్తారు.