Andhra Pradesh: చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు చోట్ల రీపోలింగ్!
- ఇప్పటికే ఐదు చోట్ల రీపోలింగ్
- ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ
- మరో 19 చోట్ల రీపోలింగ్ కోరుతున్న టీడీపీ
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో దళితులను ఓటు వేయనివ్వలేదని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదుతో ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ జాబితాలో మరో రెండు పోలింగ్ కేంద్రాలను ఈసీ చేర్చింది.
ఈ ఐదు గ్రామాలతో పాటు కాలూరు, కుప్పం బాదూరులో రీపోలింగ్ కు ఈసీ ఆదేశించింది. చంద్రగిరిలోని మొత్తం ఏడు గ్రామాలకు రేపు రీపోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. చంద్రగిరిలో ఈ గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, పోలింగ్ జరిగిన 40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఏడు గ్రామాలే కాకుండా ఏపీలోని నరసరావు పేట, రాజంపేట, రైల్వే కోడూరు, సత్యవేడు, జమ్మలమడుగు, సత్తెనపల్లి, చంద్రగిరిలోని 19 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.