varanasi: వారణాసిలో మోదీ గెలుపు కంటే.. ఆయన ఓటమే పెద్ద చరిత్రగా మిగిలిపోతుంది: మాయావతి
- మోదీ గుజరాత్ మోడల్ సక్సెస్ కాలేదు
- మోదీ, యోగిల ప్రభుత్వంలో హింస పెరిగిపోయింది
- 1977లో రాయబరేలిలో జరిగింది ఇప్పుడు వారణాసిలో రిపీట్ కావచ్చు
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బీఎస్పీ అధినేత్రి ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారణాసిలో మోదీ గెలవడం కంటే ఆయన ఓటమే పెద్ద చరిత్రగా మిగిలిపోతుందని ఆమె అన్నారు. పేదరికాన్ని అరికట్టడం, ఉద్యోగాల కల్పన, ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని పారద్రోలడంలో మోదీ చెప్పుకునే గుజరాత్ మోడల్ సక్సెస్ కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ-యోగిల డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వల్ల మత ఘర్షణలు, ద్వేషపూరిత వాతావరణం, హింస పెరిగిపోయాయని దుయ్యబట్టారు.
మోదీ, యోగి ఇద్దరూ పూర్వాంచల్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారని... యోగి నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో బీజేపీ ఓడిపోగాలేనిది .. వారణాసిలో మోదీ ఓడిపోలేరా? అని ప్రశ్నించారు. 1977లో రాయబరేలిలో జరిగింది ఇప్పుడు వారణాసిలో రిపీట్ కావచ్చని చెప్పారు. రాయబరేలిలో 1977లో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఓటమిపాలయ్యారు.