Karnataka: నీళ్లు లేవు... గుడికి రావొద్దు!: ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తులకు విచిత్ర పరిస్థితి
- నేత్రావతి నదిలో పడిపోయిన నీటిమట్టం
- ఆలయంలో నీటికి కటకట
- కర్ణాటకలో తాండవిస్తున్న కరవుకు నిదర్శనం
ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు తగినంతగా కురవకపోవడంతో కరవు కరాళ నృత్యం చేస్తోంది. అలాంటి రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. నైరుతి రుతుపవనాల సీజన్ లో సమృద్ధిగా వర్షాలు పడే ఈ రాష్ట్రంలో కొంతకాలంగా లోటు వర్షపాతం కనిపిస్తోంది. దాంతో ఇప్పుడక్కడ తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి నెలకొంది. ఎంతగా అంటే, ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మంజునాథేశ్వర ఆలయానికి భక్తులను రావొద్దంటూ ఆలయ వర్గాలు విజ్ఞప్తి చేసేంత స్థాయిలో ఇక్కడ నీటి కరవు వచ్చిపడింది.
ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. అయితే, ఆలయంలో నీళ్లు లేవని, చాలా ఇబ్బందిగా ఉందని, దయచేసి భక్తులు తమ ఆలయ సందర్శనను వాయిదా వేసుకోవాలంటూ ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని, నేత్రావతి నదిలో నీటి మట్టం పెరిగిన తర్వాత భక్తులు దర్శనానికి రావొచ్చంటూ సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మొత్తం 176 తాలూకాల్లో 156 తాలూకాలు దుర్భిక్షం బారినపడ్డాయంటే ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అంచనా వేయొచ్చు.