Jason Roy: ఇలాంటి క్రికెటర్ కూడా ఉంటాడా?
- బ్యాట్ తో బీభత్సం సృష్టించిన ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్
- రాత్రంతా నిద్రలేకపోయినా పాక్ పై వీరవిహారం
- రెండు గంటల విశ్రాంతితో మైదానంలో జూలు విదిల్చిన వైనం
క్రికెట్ వంటి క్రీడల్లో ఎంతో ఫిట్ గా ఉంటే తప్ప నూటికి నూరుపాళ్లు న్యాయం చేయలేరు. అయితే, రాత్రంతా నిద్రలేకపోయినా గానీ ఎంతో కసిగా బ్యాటింగ్ చేసి పాకిస్థాన్ పై తిరుగులేని సెంచరీ చేశాడు ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్. తన కుమార్తెను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేర్చడంతో రాయ్ కూడా మ్యాచ్ కు ముందు రోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఉదయం పూట ఆసుపత్రి నుంచి వచ్చి కేవలం రెండు గంటలు విశ్రాంతి తీసుకోగలిగాడు. ఆపై వెంటనే మ్యాచ్.
మామూలుగా అయితే చాలామంది నిద్రలేమి, తీవ్ర అలసటతో మ్యాచ్ కు దూరమయ్యే పరిస్థితి అది. కానీ జాసన్ రాయ్ మొండిపట్టుదల ముందు అవన్నీ తేలిపోయాయి. పాకిస్థాన్ తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో మొదట పాకిస్థాన్ జట్టు 340 పరుగులు చేయగా, జాసన్ రాయ్ వీరవిహారంతో ఇంగ్లాండ్ జట్టు మరో 3 బంతులు మిగిలుండగానే టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన రాయ్ 89 బంతుల్లో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సాయంతో 114 పరుగులు సాధించాడు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సందర్భంగా రాయ్ స్వయంగా చెప్పేంత వరకు అతడు నిద్రలేకుండానే మ్యాచ్ ఆడాడన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఇక, తన కుమార్తెకు నయం కావడం, మరోవైపు ఇంగ్లాండ్ గెలవడం రాయ్ కి ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా మిగిలిపోయింది.