Andhra Pradesh: పుచ్చలపల్లి సుందరయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారు.. నిజాయితీగా జీవించారు!: సీఎం చంద్రబాబు

  • నేడు పుచ్చలపల్లి 34వ వర్ధంతి
  • నివాళులు అర్పించిన ఏపీ సీఎం
  • నెల్లూరులో పుట్టిన కమ్యూనిస్టు యోధుడు

ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 34వ వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులు అర్పించారు. పుచ్చలపల్లి సుందరయ్య విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ప్రశంసించారు. పీడిత ప్రజల కోసం కడదాకా పోరాడారని కితాబిచ్చారు. ఈరోజు చంద్రబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం' నినాదంతో తెలుగు జాతి ఐక్యతకు ఎనలేని కృషి చేసిన పుచ్చలపల్లి సుందరయ్య‌ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి సుందరయ్య గారు. పీడిత ప్రజలకోసం కడదాకా పోరాడారు, తుది శ్వాస దాకా నిజాయతీగా జీవించారు’’ అని ట్వీట్ చేశారు.

నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం అలగాని పాడు గ్రామంలో పుచ్చలపల్లి శేషమ్మ, వెంకటరామిరెడ్డి దంపతులకు 1913 మే1న పుచ్చలపల్లి సుందరయ్య జన్మించారు. వీరిది భూస్వామ్య కుటుంబం. బాల్యం నుంచే అభ్యుదయ భావాలున్న సుందరయ్య, కమ్యూనిస్ట్ నేత అమిర్ హైదర్ ఖాన్ ప్రోత్సాహంతో ఉద్యమం వైపు అడుగులు వేశారు. 15 ఏళ్లకే సొంత గ్రామంలో వ్యవసాయ కార్మికుల సంఘాన్ని స్థాపించి కార్మికులకు న్యాయమైన కూలీ అందేలా పోరాడారు. ఆయన సోదరులు డాక్టర్‌ రామచంద్రారెడ్డి అన్న బాటలో నడిచారు. తన ఆస్తి మొత్తాన్ని పేదలకు దానం చేసిన సుందరయ్య.. చివరికి పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లాల్సి వచ్చింది. అంతటి నిరాడంబర జీవితాన్ని పుచ్చలపల్లి సుందరయ్య గడిపారు. ఆయన అనారోగ్యంతో 1985 మే 19న కన్నుమూశారు.

  • Loading...

More Telugu News