Cricket: కప్ గెలిచేది ఆస్ట్రేలియానే... ఆ తర్వాతే భారత్, ఇంగ్లాండ్ జట్లకు అవకాశాలు: గంభీర్
- ఆసీస్ వద్ద సరైన ప్లాన్ ఉంది
- ఆసీస్ ఓ చాంపియన్ టీమ్
- భారత జట్టులో కోహ్లీ, రోహిత్, బుమ్రా రాణిస్తారు
ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టుకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఫైనల్ చేరడానికి ఆ జట్టు వద్ద సరైన ప్రణాళిక ఉందని, చాంపియన్ గా నిలిచేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఆ జట్టులో ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఫైనల్లో భారత్ లేదా ఇంగ్లాండ్ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాడు.
ఇక సొంతగడ్డపై ఆడుతుండడం ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం అని పేర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆ జట్టులో నలుగురు ఆల్ రౌండర్లు ఉండడం అదనపు బలంగా అభివర్ణించాడు. కప్ గెలిచే విషయంలో భారత జట్టును ద్వితీయ ప్రాధాన్యతా క్రమంలో చేర్చాడు. టీమిండియాలో కోహ్లీ, రోహిత్ శర్మ భారీ స్కోర్లు సాధిస్తారని, బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా కొరకరానికొయ్యలా పరిణమిస్తాడని గంభీర్ తెలిపాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో జరగబోయే ఈ వరల్డ్ కప్ మే 30 నుంచి షురూ కానుంది.