Andhra Pradesh: ఏపీలో మళ్లీ టీడీపీనే విజయ సాధిస్తుంది: లగడపాటి సర్వే
- టీడీపీకి 100 (అటూ ఇటూగా 10 స్థానాలు)
- వైసీపీకి 72 (అటూ ఇటూగా 7 స్థానాలు)
- ఇతరులు 3 (అటూ ఇటూగా 2 స్థానాలు)
ఏపీలో టీడీపీనే విజయకేతనం ఎగరవేయబోతోందని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం తన ఎన్నికల సర్వే వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ పద్ధతిలో జరిగిన సర్వే వివరాలను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వాలన్న కోరికతో ఏపీ ప్రజలు ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రతిపక్షంగా గట్టిపోటీ ఇచ్చిందని, ఆ పార్టీ అధికారంలోకి రాకపోయినా సీట్ల సంఖ్య గణనీయంగా రావొచ్చని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’ మూడో స్థానంలో ఉందని, ఆ పార్టీ ఒక్కో జిల్లాలో ఒక్కోలా ప్రభావం చూపినట్టు తమ సర్వేలో తేలిందని అన్నారు.
ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 100 (అటూ ఇటూగా 10 స్థానాలు) రావొచ్చని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోయినా గట్టి పోటీ ఇచ్చిందని ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 72 (అటూ ఇటూగా 7 స్థానాలు), ఇతరులు 3 (అటూ ఇటూగా 2 స్థానాలు)) వస్తాయని అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీదే పై చేయిగా ఉంటుందని అన్నారు. టీడీపీకి 15 (అటూ ఇటూగా 2 స్థానాలు) వైసీపీకి 10 (అటూ ఇటూగా 2 స్థానాలు) ,ఇతరులు 1 స్థానం సాధించే అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఆయా పార్టీలకు లభించే ఓట్ల శాతం వివరాల అంచనా వివరాలను తెలిపారు.
అసెంబ్లీ స్థానాల్లో పార్టీలకు లభించే ఓట్ల శాతం
టీడీపీ- 43-45%, వైసీపీ- 40-42%, జనసేన- 10-12%
పార్లమెంట్ స్థానాల్లో పార్టీలకు లభించే ఓట్ల శాతం
టీడీపీ - 43-45%, వైసీపీ- 40.5 % - 42.5 %, జనసేన- 10-12%