Yuvraj Singh: అంతర్జాతీయ మ్యాచ్‌లకు బై బై...రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో యువరాజ్‌సింగ్?
- టీమిండియాలో చోటు దక్కడం ఇక కష్టమని తేలాక నిర్ణయం
- ఇతర దేశాల టీ20ల్లో ఆడేందుకు ఆసక్తి
- బీసీసీఐ అనుమతి కోసం త్వరలోనే దరఖాస్తు చేసే అవకాశం
సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం ప్రాభవం కోల్పోయి జట్టులో స్థానం పొందడం కష్టమయ్యే పరిస్థితుల్లో ఇకపై ఆశలు పెంచుకోవడం వృథా అని భావిస్తున్న ఈ ఆల్‌రౌండర్ బీసీసీఐ అనుమతి తీసుకుని రిటైర్మెంట్ ప్రకటించాలని, అనంతరం విదేశాల్లో జరిగే టీ20 క్రికెట్‌పై దృష్టిసారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2011 ప్రపంచ్‌కప్ విజేత జట్టులో సభ్యుడైన యువరాజ్ ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఓ వెలుగు వెలిగాడు. గాయాలు, కేన్సర్‌కు చికిత్స కారణంగా బ్యాటింగ్ వాడి తగ్గడంతో క్రమంగా అతని ప్రాభవం మసకబారింది. ఈ నెలలో ఇంగ్లండ్‌లో జరగనున్న వరల్డ్ కప్‌లో అవకాశం వస్తుందని ఆశించిన యువరాజ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా తన సత్తాచాటే సరైన అవకాశం దక్కలేదు.
ఇక టీమిండియా తరపున ఆడడం సాధ్యంకాదన్న నిర్ణయానికి వచ్చిన యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించడమే బెస్ట్ అని భావిస్తున్నారట. ఇందుకోసం బీసీసీఐ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. అనుమతి రాగానే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించినా బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టీ20 పోటీల్లో పాల్గొంటాడని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. కాగా, యువరాజ్‌కు ఇప్పటికే యూరప్, కెనడాల్లో జరిగే టీ20 క్రికెట్లో ఆడేందుకు ఆహ్వానాలు అందుతున్నట్లు సమాచారం.