New Delhi: బీఎస్పీ అధినేత్రి మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు.. ఈరోజు లక్నోలోనే ఉండాలని నిర్ణయం!
- ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు అనుకూలంగా ఉండడమే కారణం
- సోనియా, రాహుల్‌తో సమావేశం కావాల్సి ఉన్నా రద్దు
- బీఎస్పీ నేత సతీష్ మిశ్రా రాహుల్‌తో సమావేశం అయ్యే అవకాశం
విపక్షాల అంచనాలను తారుమారు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నారని తేల్చిచెప్పడంతో దేశరాజధాని ఢిల్లీలో రాజకీయ పరిణామాలు కూడా అనూహ్యంగా మారుతున్నాయి. బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న కృతనిశ్చయంతో జట్టు కట్టాలని భావిస్తున్న ఎన్డీయేతర పక్షాల ఆలోచనలోనూ మార్పు కనిపిస్తోంది.
ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం కావాల్సి ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం తాజా పరిణామంగా భావిస్తున్నారు. 'ఈరోజుకు లక్నోకే పరిమితం కావాలని మాయావతి నిర్ణయించారు, మరీ అవసరం అనుకుంటే పార్టీ నేత సతీష్ మిశ్రా ఢిల్లీలో అందుబాటులో ఉంటారు' అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
నిన్న లక్నో వెళ్లి మాయావతిని కలిసి చర్చించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మరోసారి ఢిల్లీలో మాయావతితో భేటీ కావాలని భావించారు. సోనియా, రాహుల్ మీటింగ్ పూర్తయ్యాక కలిసే అవకాశం ఉందని భావించినా ఆ భేటీ కూడా లేనట్టే.