Andhra Pradesh: చంద్రబాబు శ్మశానంలో బూడిద కుప్పను ఏరుకుంటున్నారు.. ఏపీలో జగన్ భాయ్ దూసుకుపోతున్నారు!: సామ్నా పత్రిక
- ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారు
- ఆయన ఢిల్లీలో కూటమి ప్రయత్నాలు చేయడం ఏంటి?
- సంపాదకీయం ప్రచురించిన శివసేన పత్రిక
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడిపోతున్నారని శివసేన పార్టీ పత్రిక సామ్నా తెలిపింది. ఢిల్లీలో విపక్ష కూటమిని సమాయత్తం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తన సంపాదకీయంలో ఎండగట్టింది. సొంత రాష్ట్రంలో గెలవలేని చంద్రబాబు ఢిల్లీలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం ఏంటని నిలదీసింది. ఆయన విపక్షాల కూటమిని ఏర్పాటు చేయడం లేదనీ, ప్రభుత్వ శ్మశానంలోని బూడిదను కుప్పగా ఏరుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
‘చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. రాహుల్ గాంధీని కలిశారు. శరద్ పవార్, మాయావతి, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్, దేవెగౌడతో భేటీ అయ్యారు. కర్ణాటకలో దేవెగౌడ పార్టీ(జేడీఎస్) ఓటమి ఖరారైపోయింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణాలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ ఒక్క సీటును కూడా గెలిచే పరిస్థితులు లేవు. కేరళలోనూ విపక్షాల ప్రయత్నాలు పెద్దగా ఫలితమివ్వడం లేదు.
కాబట్టి చంద్రబాబు కడుతున్నది మహాకూటమి కాదు. ప్రభుత్వ శ్మశానంలో ఆయన బూడిద కుప్పను సేకరిస్తున్నారు. ఏపీలో జగన్ భాయ్ నేతృత్వంలో వైసీపీ దూసుకుపోతోంది. టీడీపీ బాగానే పోరాడుతున్నప్పటికీ వైసీపీ స్థాయిలో లేదు. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్, కాంగ్రెస్-టీడీపీ కంటే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుందని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబుల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి’ అని సామ్నా తన సంపాదకీయంలో రాసింది.