Andhra Pradesh: ఏపీలో ఎవరొస్తున్నారు?... సొంత అంచనాలు వెల్లడించిన ప్రొఫెసర్ నాగేశ్వర్
- జగన్ సైలెంట్ గా ఉండే రకం కాదు
- చంద్రబాబుపై వ్యతిరేకతలేదు
- 'ఒక్క చాన్స్' చాలా ప్రభావం చూపింది
లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆదివారం నాడు మీడియా చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్ తో ఊదరగొట్టడం తెలిసిందే. ఎన్డీయే నేతలు అప్పుడే సంబరపడిపోతుండగా, వ్యతిరేక ఫలితాలు చవిచూసిన పార్టీలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ తప్పయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయంటూ సర్దిచెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సైతం తనవంతుగా విశ్లేషణాత్మక అంచనాలు వెలువరించారు.
గత ఎన్నికల్లో ఏపీలో అనుభవానికి ఓటేశారని, అయితే జగన్ సైలెంట్ గా ఉండే రకం కాదని, ఈసారి ఆయనకే మొగ్గు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 98 నుంచి 102 సీట్ల వరకు రావొచ్చని అంచనా వేశారు. టీడీపీ ఈ స్థాయిలో సీట్లు గెలిచేందుకు ఉన్న అవకాశాలు చాలా తక్కువని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. జనసేనకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీకి గణనీయమైన స్థాయిలో 15 సీట్ల వరకు రావొచ్చని వెల్లడించారు.
వాస్తవానికి జనాల్లో చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా, జగన్ కు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలన్న తాపత్రయమే ఓటింగ్ సరళిపై ప్రభావం చూపిందని నాగేశ్వర్ విశ్లేషించారు.