sidhu: అమరీందర్ తో ఇబ్బంది ఉంటే.. కేబినెట్ నుంచి వెళ్లిపో: సిద్ధూపై సాటి మంత్రి ఫైర్
- బీజేపీని వదిలేసిన తర్వాతే కాంగ్రెస్ లో చేరారు
- కాంగ్రెస్ ను వదిలేస్తే ఎక్కడకు వెళతారో?
- సిద్ధూపై హైకమాండ్ చర్యలు తీసుకోవాలి
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో ఆ రాష్ట్ర మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పొసగని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ మరో మంత్రి సాధు సింగ్ ధరంసూత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరీందర్ తో ఇబ్బంది ఉంటే కేబినెట్ నుంచి వెళ్లిపోవాలని ఫైర్ అయ్యారు. బీజేపీని వదిలేసిన తర్వాతే సిద్ధూ కాంగ్రెస్ లో చేరారని... ఇప్పుడు కాంగ్రెస్ ను వదిలేస్తే ఎక్కడకు వెళతారో దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు. సిద్ధూపై హైకమాండ్ చర్యలు తీసుకోవాలని... పార్టీ సమావేశంలో తాను ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు.
తన భార్య నవజ్యోత్ కౌర్ కు టికెట్ రాకపోవడానికి అమరీందర్ సింగ్ కారణమని సిద్ధూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సమాధానంగా అమరీందర్ స్పందిస్తూ, అమృత్ సర్ లేదా భటిండా స్థానాల్లో ఒక స్థానాన్ని ఎంచుకోవాలని కౌర్ కు సూచించామని... తమ ఆఫర్ ను ఆమె తిరస్కరించారని చెప్పారు.
తాజాగా నిన్న అమరీందర్ మాట్లాడుతూ, తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధూను చేయాలని సెటైర్ వేశారు. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తననే కాకుండా, పార్టీని కూడా డ్యామేజ్ చేశాయని అసహనం వ్యక్తం చేశారు.