NIA: తమిళనాడులో ఏక కాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ
- ల్యాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు స్వాధీనం
- గతంలోనూ ఎన్ఐఏ దాడులు
- శ్రీలంక దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్ఐఏ
ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశంలో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. గతనెలలో తమిళనాడులో మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా అనే ఇద్దరు వ్యక్తుల నివాసాలపై దాడులు చేసిన ఎన్ఐఏ, తాజాగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా ఐసిస్ మద్దతుదారులన్న ఆరోపణలతో దాడులు చేసిన ఎన్ఐఏ అప్పట్లో కీలక సమాచారం రాబట్టింది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు తమిళనాడులో పది ప్రాంతాల్లో సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.
రామనాథపురం, సేలం, చిదంబరం, లాలాపేట, ముత్తుపేట, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు అనుమానితుల నివాసాలను జల్లెడపట్టారు. ఈ దాడుల్లో 3 ల్యాప్ టాప్ లు, 3 హార్డ్ డిస్కులు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, 2 పెన్ డ్రైవ్ లు, 5 మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రవాదులు రక్తపుటేర్లు పారించిన నేపథ్యంలో ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం భారత్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏ ఒక్క అనుమానితుడ్నీ వదలకూడదని ఎన్ఐఏ వర్గాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.