Jagan: ఎగ్జిట్ పోల్స్‌తో మారిన జగన్ షెడ్యూల్.. రేపు సాయంత్రం తాడేపల్లి రాక
- అత్యంత ముఖ్యమైన నేతలతో రేపు సమావేశం
- జాతీయ, స్థానిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విశ్లేషణ
- ఓట్ల శాతంలో భారీ తేడాపై వైసీపీలో చర్చ
ఆదివారం నాటి ఎగ్జిట్ పోల్స్‌తో వైసీపీ చీఫ్ జగన్ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. పార్టీ నేతలతో జగన్ ఈ రోజు సమావేశం కావాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. మారిన షెడ్యూలు ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని జగన్ సమీక్షిస్తారు. ఇందుకోసం రేపు సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. అత్యంత ముఖ్యమైన నేతలతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ, స్థానిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విశ్లేషిస్తారు.
జాతీయ చానళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీడీపీ-వైసీపీ మధ్య ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉండడం వైసీపీ నేతల్లో చర్చకు కారణమైంది. ఈసారి పోల్మేనేజ్మెంట్లో చంద్రబాబు వెనకబడ్డారని భావిస్తున్న వైసీపీ నేతలు జాతీయ చానళ్లు చెబుతున్నట్టు ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతంలో అంత తేడా ఉండే అవకాశం లేదంటున్నారు. జాతీయ చానళ్లు చెబుతున్నట్టు 5 నుంచి 10 శాతం ఓట్ల తేడా అంటే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని, కానీ బూత్ స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.