Sun: ముచ్చెమటలు పట్టిస్తున్న సూరీడు.. తెలంగాణలో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- ఏపీ, తెలంగాణలో నేడు వడగాలులు వీచే అవకాశం
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణపై సూరీడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. రాష్ట్రంలో సోమవారం ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఏకంగా 46 డిగ్రీలకు చేరుకున్నాయి. నేడు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణతోపాటు ఏపీలోని చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు.