Hyderabad: అవుటర్ రింగు రోడ్డుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు కిలోమీటర్ల దూరంలో డ్రైవర్ మృతదేహం!
- ద్రాక్షపండ్ల లోడుతో షోలాపూర్ నుంచి విజయవాడకు
- పెద్ద గోల్కొండ వద్ద ప్రమాదం
- ఎగిరి ట్రక్కులో పడి మృతి చెందిన డీసీఎం డ్రైవర్
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మిస్టరీగా మారింది. ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందాడు. అయితే అతడి మృతదేహం ఘటనా స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో పడి ఉండడం అనుమానాలకు తావిస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరుకు చెందిన కుమ్ము ఏడుకొండలు(32) ద్రాక్ష పండ్ల లోడుతో ఈ నెల 19న షోలాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరాడు. ఆదివారం అర్ధరాత్రి శంషాబాద్ పరిధిలోని పెద్దగొల్కోండ సమీపంలో ముందు వెళ్తున్న ట్రక్కును ఏడు కొండలు డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అయితే, ప్రమాదానికి గురైన డీసీఎంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు అనుమానించారు. చుట్టు పక్కల వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆసుపత్రులలో విచారించారు. అయినా ఎటువంటి సమాచారం లభించలేదు.
అయితే, ఘటనా స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఓ మృతదేహం పడి ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి డీసీఎం డ్రైవరేనని గుర్తించారు. మృతదేహం వద్ద డీసీఎం వైపర్ ఉండడంతో ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ ఎగిరి ట్రక్కులో పడి ఉంటాడని, వాహనం డ్రైవర్ గమనించకుండా అలాగే వెళ్లిపోయి ఆ తర్వాత అక్కడ పడేసి వెళ్లిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.