Anjani Kumar: కౌంటింగ్ నాడు ర్యాలీలు రద్దు, మద్యం బంద్!
- హైదరాబాద్ పరిధిలో ఆంక్షలు
- 144 సెక్షన్ అమలు
- బాణసంచా కాల్చడంపైనా ఆంక్షలు
- వెల్లడించిన సీపీ అంజనీ కుమార్
ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ఆంక్షలను విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. కౌంటింగ్ నాడు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ మంది ఒకచోట గుమికూడేందుకు వీల్లేదని, విజయోత్సవ ర్యాలీలు జరపరాదని ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్టు తెలిపారు. నగర పరిధిలోని కల్లు దుకాణాలు, స్టార్ హోటళ్లలోని బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, మిలటరీ క్యాంటీన్లన్నింటికీ ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని, పరిమితికి లోబడి మాత్రమే డీజేలకు అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర, నగర పోలీసు బలగాలు పహారా కాస్తాయని అంజనీ కుమార్ వెల్లడించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే, వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.